1 July, 2026 | 1:34 AM

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన పర్యటన

01-07-2026 12:35 AM

కుత్బుల్లాపూర్, జూన్ 30 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. శ్రీజన ఐఎఎస్ ‘వన్ వార్డ్ ఎవ్రీ డే‘ ప్రోగ్రాం లో భాగంగా కుత్బుల్లాపూర్ జోన్, దుండిగల్ సర్కిల్-59 పరిధిలోని వార్డు నెం. 296 లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనుల మెరుగుదల, ఖాళీ స్థలాలలో పిల్లల కోసం ఆట వస్తువుల ఏర్పాటు, స్మశానవాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం కమిషనర్ శ్రీజన మాట్లాడుతూ ఎస్‌ఎల్‌ఏ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇంటి నంబర్ల జారీ, పన్ను తగ్గింపు, ఇంజనీరింగ్ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ఖాళీ స్థలాల తనిఖీ, వాటి అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎల్‌ఓ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణి కరణ్ , మేడ్చల్ మల్కాజిగిరి గ్రంథాలయ చైర్మన్ బి. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ పాపమ్మ, ఎస్ డబ్ల్యూ ఎం డిప్యూటీ ఇంజనీర్ అన్వేష్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, ఏఎంసి లక్ష్మయ్య, అసిస్టెంట్ ఇంజనీర్లు బి. సురేందర్ నాయక్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.