15 July, 2026 | 1:50 AM

పెద్దపల్లిలో కోకాకోలా ప్లాంట్

09-06-2024 01:48 AM

రూ.700 కోట్లతో నూతన యూనిట్ ఏర్పాటు

కంపెనీ ప్రతినిధులతో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి సమావేశం

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): అమెరికా శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోలా తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కోకాకోలా అనుబంధ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్‌సీసీబీ) ద్వారా రూ.700 కోట్లతో పెద్దపల్లిలో నూతన తయారీ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం అట్లాంటాలోని కోకాకోలా ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో సమావేశ మయ్యారు. కోకాకోలా ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. కొత్త ప్లాంట్ ఏర్పాటుపై ఈ ఏడాది జనవరిలో కోకాకోలా గ్రూప్ డైరెక్టర్ జోనాథన్ రీఫ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుతో పాటు, ఇప్పటికే ఉన్న ప్లాంట్ల విస్తరణపై చర్చించారు. తెలంగాణలో వ్యాపార విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని సీఎం, మంత్రి నాడు హామీ ఇచ్చారు. దీంతో తాజాగా రాష్ట్రంలో నూతన ప్లాంట్ ఏర్పాటుకు కంపెనీ సుముఖతను వ్యక్తం చేసింది. 

కంపెనీ విస్తరణ..

తెలంగాణలో యూనిట్‌ను పెట్టేందుకు కోకాకోలా కంపెనీ సైట్లను షార్ట్ లిస్ట్ చేసిందని, పెద్దపల్లిలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నట్లు శ్రీధర్‌బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు, ఎంఎన్‌సీల ఏర్పాటుకు ఈ పరిణామం దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ తన వ్యాపారం మరింత బలోపేతం చేసుకునేందుకు, వృద్ధిని సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని శ్రీధర్‌బాబు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సమీపంలో హెచ్‌సీసీబీ ఆధ్వర్యంలో కొత్తగా రూ.1,600 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో తర్వలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అలాగే అమీన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ఇటీవల కంపెనీ విస్తరించింది. సిద్దిపేటలోనూ కోకాకోలా ఒక ప్లాంట్‌ను రూ.1000 కోట్లతో ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సర్కారుతో ఎంఓయూ పూర్తయ్యింది. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ వైఎస్ చైర్మన్, ఎండీ విష్ణువర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

డెల్టా ఎయిర్‌లైన్స్ పెట్టుబడులు..

అనంతరం అట్లాంటాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ వీసీ, సీటీఓ కృష్ణకుమార్‌తో మంత్రుల బృందం సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని శ్రీధర్‌బాబు వివరించారు. మంత్రి వివరణపై సానుకూలంగా స్పందించిన డెల్టా టీం పెట్టుబడులు పెట్టేందుకు సముఖంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా అట్లాంటా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులు నడుపుతామని చెప్పారు.