మీడియా కీర్తి పెంచిన రామోజీ
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: సీఎం రేవంత్
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషన్ గ్రహీత రామోజీరావు మరణం దిగ్భాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మరణం తెలుగు మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటు అని తెలిపారు. రామోజీరావు మృతికి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకు దక్కుతుందని కొనియాడారు. తెలుగువారి కీర్తిని జాతీయ స్థాయిలో చాటిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు.
ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఆయన.. ఈ టీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశదిశను చూపారని ప్రశంసించారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛ నాలతో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. అంత్యక్రియల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అక్కడి నుంచే పలు సూచనలు ఇచ్చారు. అంత్యక్రియలను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు.






