26 February, 2026 | 12:08 AM

ఇందిరమ్మ ఇళ్లలో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

25-02-2026 08:22 PM

దళారులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరిక

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్  ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు ఛాంబర్‌లో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులుగా కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండటం తమ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రతి రోజు సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఫ్లోర్ లీడర్ ఛాంబర్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను స్వయంగా విని వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, స్పందనలో జాప్యం అస్సలు ఉండకూడదని అన్నారు.గతంలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు సరైన నిధులు కేటాయించలేదని విమర్శించారు.ప్రస్తుతం అన్ని డివిజన్లకు, పార్టీ భేదం లేకుండా అన్ని డివిజన్లకు కూడా సమానంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

అభివృద్ధిలో రాజకీయాలకు స్థానం లేదని, ప్రజలే ప్రాధాన్యం అని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల అమలుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉండటంతో చాలా మందికి ఇంటి స్థలాలు లేక ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతోందని వివరించారు. ఇంటి స్థలం ఉన్న అర్హులు తమ పత్రాలను వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేయాలని కోరారు.ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరూ డబ్బులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు అడిగితే వారు ఎంతటి వారైనా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఫిర్యాదు చేసిన వారికి ప్రోత్సాహక బహుమానం ఇవ్వడమే కాకుండా, డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం కార్పొరేటర్లతో కమిషనర్  చాహత్ బాజ్ పాయ్ ని కలిసి పలు కాలనీలల్లోని సమస్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, మామిండ్ల రాజు యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, చీకటి ఆనంద్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.