ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత, వేగంపై కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు గడువులోపు పూర్తి చేయాలని ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం/సుజాతనగర్, ఏప్రిల్ 15, (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలతోవేగవంతం గా పూర్తి చేయాలని, నిర్ణయత గడువుల్లోగా ఇండ్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సుజాతానగర్ మండలం మర్రి తండ గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన బుధవారం సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలో మొత్తం 99 ఇళ్లకు అనుమతులు మంజూరు కాగా, అందులో 65 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిని సవివరంగా పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇప్పటివరకు జరిగిన వ్యయం, ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లేబర్ చార్జీలు ఎంత అవుతున్నాయి, అదనంగా లబ్ధిదారులు ఎంత మొత్తం వెచ్చిస్తున్నారు వంటి అంశాలపై ప్రశ్నించి సమగ్ర సమాచారం సేకరించారు.
ఈ క్రమంలో మూడ్ మౌనిక, హాథిరాం, భూక్య అమల, భూక్య సునీత, భూక్య పంతులీ తదితర లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో సుమారు 650 మంది జనాభా ఉండగా, వారిలో అధిక సంఖ్యలో తాపీ మేస్త్రీలు ఉన్నారని కలెక్టర్ గమనించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి అదనంగా లబ్ధిదారులు స్వంతంగా పెట్టుబడి పెట్టి, తామే స్వయంగా ఇళ్ల నిర్మాణంలో పాల్గొనడం ద్వారా లేబర్ ఖర్చులను తగ్గించుకుంటూ ఇళ్లను నిర్మించుకుంటున్న విషయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, గృహ నిర్మాణ శాఖ ఏఈ లాల్ సాబ్, పంచాయతీ సెక్రటరీ విజయలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






