28 March, 2026 | 8:12 PM

నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి

28-03-2026 06:38 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా మద్నూర్ బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సరఫరా చేస్తున్న గుడ్లను తూకం వేసి బరువును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, స్వయంగా గుడ్లను తూకం వేసి వాటి బరువును పరిశీలించారు.

నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్ల బరువు ఉందో లేదో తనిఖీ చేస్తూ, తక్కువ బరువుతో సరఫరా అవుతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తక్కువ బరువుతో గుడ్లు సరఫరా అయితే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, సరఫరాలో నాణ్యత లోపాలు ఉంటే కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం, వసతులపై ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, విద్యార్థులకు పోషకాహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్కూల్‌ లో శుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి రామ్మోహన్,  సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.