18 April, 2026 | 6:10 PM

ఉపాధి హామీ లక్ష్యాలు చేరుకోవాలి: కలెక్టర్ బి.సత్యప్రసాద్

18-04-2026 04:50 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో శనివారం ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంపుపై ప్రత్యేకంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో మరిన్ని కూలీలను ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పనుల అందుబాటును పెంచాలని, పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు.

పనుల ప్రగతిని రోజువారీగా పర్యవేక్షించాలని, కూలీల హాజరు నమోదు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. మస్టర్ రోల్స్‌లో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలను కూడా ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలని తెలిపారు.ప్రతి పనిని ఫోటో క్యాప్చరింగ్ ద్వారా ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేయాలని, జియో ట్యాగింగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

లక్ష్యాలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం కీలకమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వేసవి కాలం దృష్ట్యా పనులకు వచ్చే కార్మికులకు షేడ్ నెట్‌లు, తాగునీరు, ఓఆర్‌ఎస్, ప్రథమ చికిత్స తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.