18 March, 2026 | 6:29 AM

జనరల్ ఆస్పత్రిలో కలెక్టర్ విస్తృత తనిఖీలు

18-03-2026 12:00 AM

కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన జనరల్ హాస్పిటల్ లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ హాస్పిటల్ లోని ఓపి వార్డు, ఏఎంసీ, ఐసీయూ, పిడియాట్రీషియన్, ఎస్‌ఎన్సియు, జనరల్ మెడికల్ వార్డు, ఆలనా సెంటర్, ప్రతి వార్డులు తిరుగుతూ వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు, వారి బంధువులతో స్వయంగా మాట్లాడారు. హాస్పిటల్ లో అందిస్తున్న సేవలు, ఆహారం తదితర అంశాలపై ఆరా తీశారు.

హాస్పిటల్ లోని సిబ్బంది హాజరు పట్టిక, స్టోర్ కు వెళ్ళి స్టాక్ రిజిస్టర్, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రిజిస్టర్లు, డ్యూటీ ఆర్డర్స్, రిజిస్టర్, వైద్య పరీక్షలు నిర్వహించే ఇండెంట్ రిజిస్టర్, బయోమెట్రిక్ రిజిస్టర్, మెడిసిన్ స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సుదీర్ఘ సమయం హాస్పిటల్, వార్డులు, పరిసరాలను స్వయంగా పరిశీలించారు.

వివిధ ఆరోగ్య సమస్యల వైద్యం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి నిరుపేద సామాన్య ప్రజలు తదితరులు వైద్యం కోసం రావడం జరుగుతుందని, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అత్యాధునిక పరికరాలతో వైద్య విధాన సేవలు, టెస్టులు, ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో నాణ్యమైన, వేగమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ప్రత్యేకంగా చిన్న పిల్లలు, డయాలసిస్ పేషంట్స్, తదితర దీర్ఘ కాలిక వైద్య సేవల కోసం వచ్చిన వారికి ఆస్పత్రిలో కల్పించిన సౌకర్యాల ద్వారా వైద్య చికిత్సలు అందించాలని, పేషంట్ల సహాయార్థం వచ్చే వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చిన్నపిల్లల కోసం ఆలనా సెంటర్ లలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

హాస్పిటల్‌లో పేషెంట్లకు వారి సహాయకులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను నిత్యం పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు వారి బంధువులతో వైద్య సిబ్బంది సేవ భావంతో ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వెంకట్ లకావత్, డాక్టర్ జగదీష్, డాక్టర్ హర్షవర్ధన్, తదితరులు ఉన్నారు.