భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
వరంగల్, మార్చి 1 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎన్.పి.డి.సి.ఎల్ సి.ఎం.డి వరుణ్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం ఉదయం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆలయ ఈవో రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మూగా శ్రీనివాసరావులు పూర్ణకుంభం, మంగళవాద్యాలతో ఘనస్వాగతం పలికారు.
ముందుగా ఆది శంకరాచార్యులను, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజానంతరం ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యవమున అర్హకులు, వేద పండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.




