9 May, 2026 | 8:33 PM

రగుడు ధాన్యం కొనుగోలు కేంద్రన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్

09-05-2026 08:02 PM

తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలి

టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలి

సిరిసిల్ల,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించి తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతుల సౌకర్యార్థం కల్పించిన సౌకర్యాలు, దిగుబడి వివరాలు, హమాలీల గురించి ఆరా తీశారు. 

కొనుగోలు కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన వెంటనే జాప్యం చేయకుండా తూకం వేయాలని, అందుకు సరిపడా హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. స్థానిక రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు  ఎంత వరకు ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పూర్తయింది అనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 

కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు వాహనాల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించే అవకాశం ఉందని, జాప్యం చేయకుండా తరలించాలని, మిల్లుల్లో ధాన్యం బస్తాలు త్వరగా అన్ లోడ్ అయ్యేలా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. తనిఖీలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సహకార శాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ జయంత్, తదితరులు ఉన్నారు.