01-11-2025 06:17:36 PM
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
వివిధ శాఖల అధికారులతో సమీక్ష
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇటీవల తుఫాన్ తో జిల్లాలో జరిగిన నష్టం అంచనాలు రూపొందించడంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇటీవల తుఫాన్ కారణంగా పాక్షికంగా, పూర్తిగా నష్టపోయిన ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు, పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు, రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు నష్టంపై ఆర్అండ్ బీ, పీఆర్ అధికారులు, స్కూల్స్, అంగన్వాడి కేంద్రాలు, రెసిడెన్షియల్ హాస్టళ్ల, ప్రభుత్వ శాఖల భవనాల్లో లీకేజీలపై డీఈఓ, డీడబ్ల్యూఓ, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల లీకేజీలు, మరమ్మత్తుపై నీటి పారుదల శాఖ అధికారులు, విద్యుత్ స్తంభాలు, సబ్ స్టేషన్లలో నష్టం అంచనాలు సెస్ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి నివేదికను మంగళవారంలోగా అందజేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ఈఈ ఆర్అండ్ బీ నరసింహాచారి, డీఏఓ అఫ్జల్ బేగం, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిషోర్ కుమార్, సెస్ ఎండీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.