11 June, 2026 | 3:24 PM

విద్యుత్ షాక్ తో మహిళ మృతి

11-06-2026 02:19 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 11: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో బుధవారం సాయంత్రం విద్యుత్ షాక్ కు గురై ఓ మహిళ మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన దాసరి లక్ష్మి(35)భర్త రాజేందర్ తన తల్లి గారి గ్రామమైన మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి తన తల్లిదండ్రులు వనగాల రాములు,లక్ష్మమ్మలను చూడడానికి గత వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది.

ఈ క్రమంలో ఇంట్లో తమ బట్టలు ఉతికి ఆరవేయడానికి వెళ్ళగా బట్టలు ఆరవేసే దండానికి విద్యుత్ సరఫరా జరిగి,విద్యుత్ షాక్ కు గురై లక్ష్మి అక్కడక్కడే మృతి చెందింది.ఈ విషాద ఘటనతో స్థానికులు,తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ ఘటనా స్థలికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి,ఓదార్చారు.ఈ సంఘటనపై లక్ష్మీ సోదరుడు వనగాల యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్ఐ రాములు తెలిపారు.