12 May, 2026 | 1:25 AM

విద్యార్థినుల భవిష్యత్‌కు మెరుగైన వసతులు కల్పిస్తాం

12-05-2026 12:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి తో కలిసి అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన కలెక్టర్ కె హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే11 (విజయక్రాంతి): రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలసి కలెక్టర్ కె. హరిత సోమవారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేజీబీవీలో విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత బాలికలు ఉన్నత విద్యలో రాణించేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అనంతరం ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎమ్మెల్యే, కలెక్టర్లు ప్రత్యేకంగా అభినందించి శాలువాలు కప్పి సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కర్నాతం సంజీవ్, వైస్ చైర్మన్ రంగు మహేష్, మాజీ మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్లు దుర్గం భరద్వాజ్, మాదాసు రవీందర్, ఉప సర్పంచ్లు జగదీష్ వరలక్ష్మి, మామిడి లక్ష్మి, నాయకులు మధునయ్య, బుర్స పోచమల్లు, అరుణ మురళి గౌడ్, పద్మ, విలాస్తో పాటు వివిధ శాఖల అధికారులు, పాఠశాల యాజమాన్యం, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.