స్వీయ జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి
- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న స్వీయ జనగణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 20 మండలాలు, 460 గ్రామాలు నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 86 వార్డుల్లో జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు.
2011 తర్వాత 2021లో నిర్వహించాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడిందని, ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సెన్సస్–2027 కార్యక్రమాన్ని ప్రారంభించాయని పేర్కొన్నారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే మొదటి దశ స్వీయ గణనలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ప్రజలు కంప్యూటర్, మొబైల్ లేదా ట్యాబ్ ద్వారా సెన్సస్ పోర్టల్ https://se.census.gov.inలో తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
జిల్లాలో సుమారు 2,500 మంది సిబ్బంది జనగణన కార్యక్రమంలో పనిచేస్తున్నారని స్వీయ గణన పూర్తిచేసిన తర్వాత వచ్చే ఎస్ఈ ఐడి నంబర్‌ను భద్రపరచుకోవాలని, మే 11 తర్వాత ఇంటికి వచ్చే జనగణన అధికారికి ఆ ఐడీ చూపిస్తే వారు వివరాలను పరిశీలించి ఆమోదం తెలుపుతారని తెలిపారు. స్వీయ గణన చేయని వారివద్ద జనగణన అధికారులు ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేస్తారని చెప్పారు.
ప్రభుత్వ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు లేదా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు జనగణనతో ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, వ్యక్తిగత సమాచారం బయటకు వెల్లడి కాదన్నారు. జనగణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని, స్వీయ గణనలో 27 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చని చెప్పారు. మిగిలిన ప్రశ్నలను ఇంటికి వచ్చే జనగణన అధికారి నమోదు చేస్తారని తెలిపారు. ప్రజలు సరైన సమాచారం అందించి జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.






