14 March, 2026 | 12:57 AM

గ్యాస్ ఏజెన్సీ, రెస్టారెంట్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

14-03-2026 12:07 AM

ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు కాల్ చేయాలని వినియోగదారులకు సూచన 

నిజామాబాద్, మార్చి 13(విజయక్రాంతి): గ్యాస్ కొరత నెలకొందనే వదంతుల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పరిశీలన కోసం స్వయంగా తనిఖీలు నిర్వహించారు. నగరంలోని తిలక్ గార్డెన్ ఎదురుగా గల  భారత్ గ్యాస్ ఏజెన్సీ అయిన శిల్పా ఎంటర్ ప్రైజెస్ ను, అదే ప్రాంతంలో కొనసాగుతున్న జాఫ్రాన్ హౌజ్ మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ లను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

ముందుగా గ్యాస్ ఏజెన్సీని సందర్శించిన కలెక్టర్, ఆన్లైన్ బుకింగ్ వివరాలు పరిశీలించారు. ఎల్.పీ.జీ గ్యాస్ సిలిండర్ల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు ఎన్ని బుకింగ్ లు అవుతున్నాయి, తదనుగుణంగా సిలిండర్ల పంపిణీ జరుగుతోందా అని ఆరా తీశారు. ఇప్పటికైతే ఎలాంటి కొరత లేదని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే గ్యాస్ కొరత వదంతుల వల్ల బుకింగ్ లు పెద్ద ఎత్తున పెరిగాయని అన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తూ, సిలిండర్లను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆన్లైన్ బుకింగ్ లో వినియోగదారులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే సంబంధిత కంపెనీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు కాల్ చేయాలని వినియోగదారులకు సూచించారు.

అనంతరం కలెక్టర్ జాఫ్రాన్ హౌజ్ మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు వండేందుకు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను పరిశీలించారు. గృహ అవసరాలకు ఉద్దేశించిన డొమెస్టిక్ సిలిండర్లను వాడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్‌ఓ అరవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు.