03-02-2026 07:30:03 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్,(విజయక్రాంతి): విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టులు కేవలం సైన్స్ ఫెయిర్లకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే వస్తువుల్లాగా మారడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(కుమార్వాడి)లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.
కరీంనగర్ జిల్లాలోని 17, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 8 అటల్ టింకరింగ్ ల్యాబ్ సౌకర్యం ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులు తమ ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల స్థాయి ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా అటల్ టింకరింగ్ ల్యాబ్ సౌకర్యం ఉన్న పాఠశాల విద్యార్థులు పాల్గొనడం మంచి విషయమని అన్నారు.
గుడ్ టచ్ బ్యాడ్ టచ్, కోతుల సమస్య-పరిష్కారం వంటి ఎన్నో ఆవిష్కరణలను ఈ విద్యార్థులు తమ ప్రాజెక్టుల ద్వారా రూపొందించారని తెలిపారు. జిల్లాలోని 35 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, యూనిసెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గిరిజాశంకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.