02-05-2025 10:50:11 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): అకాల భారీ వర్షం కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని ఎర్ర చెరువు సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. తడిసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ మొత్తంలో హమాలీలను ఏర్పాటు చేసి తడిసిన ధాన్యం మొలకెత్తక ముందే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
వ్యవసాయ శాఖ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అకాల భారీ వర్షం వల్ల ధాన్యం కొట్టుకపోయిన రైతుల వివరాలను నమోదు చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యం వివరాలు పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి అందించి నష్టపరిహారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, డీ ఎం రాములు, సహకార శాఖ అధికారి వాలియా నాయక్ తహసీల్దార్ ప్రహ్లాద రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.