03-05-2025 10:54:13 AM
అర్హుల ఎంపికలో కమిటీల నాయకుల మధ్య సయోధ్య
డబ్బులు... ముట్టబెడితేనే... లిస్టులో పేర్లు.
గ్రామాల్లో ప్రేక్షక పాత్ర పోషిస్తున్న.. మండల అభివృద్ధి అధికారులు
తుంగతుర్తి, విజయక్రాంతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Anumula Revanth Reddy) పేద ప్రజల ప్రయోజనాల దృష్ట ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు(Indiramma house) పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనితో ప్రతి నియోజకవర్గంలో 3500 పై చిలుకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో గడిచిన 20 రోజుల తరబడి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక విషయంలో తుంగతుర్తి మండలంలో ఆదిలోనే బంగపాటు జరుగుతున్నది. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా గ్రామములో ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేయగా, దీనిలో కొందరు మాత్రం డబ్బులకు ఆశపడి, అవినీతి ముసుగులో అర్హులను గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారు.15 రోజులు గడిచినప్పటికీ గ్రామాల్లో నేటి వరకు పూర్తిస్థాయిలో అర్హుల లిస్టు ప్రకటించకపోవడం దారుణమైన విషయం.
మండల అభివృద్ధి అధికారి మాత్రం నేనేమీ చేయను. మేము రాసిన లిస్టు పేర్లను వాళ్లు తీసివేస్తున్నారు. వాళ్లు రాసిన లిస్టు మాత్రం ఇష్టారాజ్యంగా ఉన్నవి అని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి పట్టణ కేంద్రంలో 88 ఇండ్లు మంజూరు జరుగుతున్నట్లు తెలపగా, ఇప్పటికీ సుమారు 160 పేర్లకు పైగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు లిస్టులో పేర్కొనడం జరిగినట్లు సమాచారం. ఎవరి పేరు తీసివేయాలి ఎవరిని ఉంచాలని వారికి వారే తలలు పీక్కునే విధంగా లిస్టు తయారయ్యి ఉన్నది. ఈ లిస్టులో ఐటీ రిటర్నర్స్ దాఖలు చేస్తున్న వ్యక్తులు , గతంలో సొంత ఇల్లు ఉండి అమ్మకాలు చేసిన వ్యక్తులు, ఇతర ప్రాంతాల్లో ఇల్లు ఉండి కూడా నమోదు చేయడం గమనార్హం. ఇందిరమ్మ ఇల్లు పథకంలో అర్హులైన లబ్ధిదారులు గుర్తించడంలో మండల అభివృద్ధి అధికారులు విఫలమయ్యారని దుయ్యబడుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి తుంగతుర్తి మండల నమోదైన పేర్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, న్యాయం చేయాలని వివిధ పార్టీ నాయకులు, పేద ప్రజలు కోరుతున్నారు.