31-07-2025 05:40:59 PM
నేలపై కూర్చొని విద్యార్థులతో భోజనం చేసిన కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): మీలాగే నేను కూడా మీతో పాటు కలిసి భోజనం చేస్తానంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి మండలం ఆజంనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం తిన్నారు. గురువారం ఆజం నగర్ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మమేకమయ్యారు.
విద్యాబోధన, విద్యా ప్రగతిపై విద్యార్థులతో కలిసిమెలిసి అడిగి తెలుసుకున్నారు. వివిధ సబ్జెక్టుల్లో వారికి ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. అనంతరం మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులతో సహా నేలపై కూర్చొని భోజనానికి ముందు ప్రార్ధన చేసి సహపంక్తి భోజనం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు మెరుగని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.