21 August, 2026 | 7:24 PM

రాజకీయ పార్టీల సహకారంతో పారదర్శక ఓటర్ల జాబితా

21-08-2026 06:44 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, (విజయక్రాంతి): పారదర్శకంగా, తప్పులులేని ఓటర్ల జాబితా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతి, మ్యాప్ కాని ఓటర్లు, అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియపై చర్చించారు.

ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించామని, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లాలో 11,739 మంది మ్యాప్ కాని ఓటర్లు, 20,685 మంది అనామలీస్ ఓటర్లు ఉన్నారని, మొత్తం 32,424 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉందన్నారు. సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓల ద్వారా నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లో విచారణ నిర్వహిస్తామని, అక్టోబర్ 15 నాటికి ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరై జనన తేదీ, నివాసం తదితర వివరాలను ధృవీకరించే ఆధారాలు సమర్పించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ సూపర్‌వైజర్లు సమన్వయంతో పనిచేసి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నవీన్ రెడ్డి, ఆర్డీఓ హరికృష్ణ, ఎన్నికల అధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.