21 August, 2026 | 7:30 PM

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం

21-08-2026 06:57 PM

సర్పంచ్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయి. గ్రామ అభివృద్ధి కోసం వచ్చిన ప్రజాధనాన్ని కొల్లగొడుతూ, నిబంధనలను కాలరాస్తున్న సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి బాగోతం అధికారికంగా బట్టబయలైంది. పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని  వార్డు మెంబర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ (DlPO) జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కలెక్టరేట్ జారీ చేసిన షోకాజ్ నోటీసులో సర్పంచ్ చేసిన అవినీతి బండారం ఒక్కొక్కటిగా బయటపడింది.

విచారణలో తేలిన చీకటి కోణాలు & అక్రమాలు:

1. శానిటేషన్ పనులు చేసిన అసలు లేబర్ కాంట్రాక్టర్‌ను పక్కనబెట్టి, సంబంధం లేని 'ఓం సాయి ఎలక్ట్రికల్స్' సంస్థకు రూ. 48,670/- అక్రమంగా కట్టబెట్టారు.

2. అత్యంత తక్కువ రేటు కోట్ చేసిన 'భారత్ ట్రేడర్స్' సంస్థను కాదంటూ, పనులు పూర్తయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా 'రాజరాజేశ్వర కన్స్రక్షన్స్ అండ్ డెవలపర్స్' సంస్థకు ఏకంగా రూ. 3,00,792/- దారాదత్తం చేశారు.

3. ట్రాక్టర్ రిపేర్లు, జేసీబీ పనులు, డీజిల్ సరఫరా పేరిట రావాల్సిన బిల్లులకు బదులుగా... ఆ ఖర్చులతో ఎలాంటి సంబంధం లేని 'ఓం సాయి ఎలక్ట్రికల్స్' సంస్థ ఖాతాలోకి FTO ద్వారా రూ. 85,820/- మళ్లించి ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా దోచుకున్నారు.

4. తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్-2018 సెక్షన్ 70(4) ప్రకారం నిబంధనలకు అనుగుణంగా జరగాల్సిన ఆర్థిక లావాదేవీలు మరియు నిర్వహణలో సర్పంచ్ తీవ్రమైన లోపాలకు పాల్పడినట్లు తేలింది. సర్పంచ్ చేసిన ఈ తీవ్రమైన పరిపాలనా లోపాలు మరియు అధికార దుర్వినియోగంపై ఆయన చెక్ పవర్  ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కామారెడ్డి కలెక్టర్ (పంచాయత్ వింగ్) కార్యాలయం నుండి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. నోటీసులు అందిన 7 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకుంటే, రికార్డుల ఆధారంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.