కొనుగోళ్లపై చర్చకు రావాలి
- రైతు గోస పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
- వారి బాధలు తెలియాలంటే కాంగ్రెస్ నేతలు కల్లాల వద్దకు రావాలి
- ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం
- మూలకు పడ్డ ఓరుగల్లు రైతు డిక్లరేషన్
- బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు
- పెద్దపల్లి, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల్లో రైతు గోస, బీజేపీ భరోసా బస్సు యాత్ర
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్)/మంథని, మే 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ నేత లు చర్చకు రావాలని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు సవాల్ చేశారు. రైతుల బాధలు తెలియాలంటే కాంగ్రెస్ నేతలు కల్లాల వద్దకు రావాలన్నారు. ఓరుగల్లు రైతు డిక్లరేషన్‌ను మూలకు పడేసిన కాంగ్రెస్.. రైతుల గోసను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రైతుగోస భరోసా బస్సుయాత్ర బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని వడ్లకొనుగోలు కేంద్రాన్ని, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల్లో కేంద్రాలను సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నా యకులు కల్లాల వద్దకు రావాలని డిమాండ్ చేశారు.
ముందస్తు అంచనా లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి కారణమైందని ఆరోపించారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి దూరదృష్టి లేదనడానికి ఇదే ఒక కారణంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో లక్షలాది క్వింటాళ్ల ధాన్యం ఇప్పటికీ కుప్పలుగా పేరుకుపోయి ఉందని చెప్పారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సొంత నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన రైతులపై కాటా రం ప్రాంతంలో అక్రమ కేసులు నమోదు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, ధాన్యంకొనుగోలు విషయం లో రాజకీయాలు మాని వెంటనే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని చేశారు.
మూలకు పడ్డ ఓరుగల్లు రైతు డిక్లరేషన్
ఓరుగల్లు వేదికగా రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని బీజేపీ నేతలు విమర్శించారు. రైతులకు నిరంతరం బీజేపీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు వెంబడిస్తామని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, వానాకాలం పంటల సాగుకు రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వెంటనే ఎరువులు విత్తనాలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
రాబోయే వారం రోజుల్లో దాన్యం కొనుగోలు పూర్తి చేయాలని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా రైతు పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ ల పేరుతో 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రైతులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వలేదని, కౌలు రైతులను విస్మరించారని, వ్యవసాయ కూలీలను గాలికి వదిలేసారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల సునీల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకే ష్, వెంకటరమణరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కొండపాక సత్యప్రకాష్, రాపర్తి సంతోష్, పార్టీ నాయకులు సబ్బాని సంతోష్, సామల అశోక్, బొల్లంపల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు.






