మీ పదేండ్ల అరాచకాల చిట్టా విప్పుదాం రా!
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నా సవాల్ స్వీకరించు..
- నువ్వు చేసింది ప్రజా సంక్షేమ నీ సంక్షేమా తేలుద్దాం..
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్
దేవరకద్ర, ఏప్రిల్ 27 : నువ్వు నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తే నీ పదేండ్ల కాలంలో నువ్వు చేసిన అరాచకాలను చిట్టా విప్పుదాం బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులకు కేరాఫ్ అడ్రస్గా మారిన గత పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
నియోజకవర్గంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ను అడ్డుకోవాలని చూడటం హీనమైన చర్య అని ఎమ్మెల్యే మండిపడ్డారు. ‘చిన్నచింతకుంటలో 25 ఎకరాల భూమి ఎక్కడుందో చూపించండి? కురుమూర్తి జాతర స్థలం భక్తుల అవసరాలకే సరిపోదని, అలాంటి చోట స్కూల్ ఎలా నిర్మిస్తారు?‘ అని ప్రశ్నించారు. కురుమూర్తి స్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేదంటే ముక్కు నేలకు రాస్తావా..?
స్కూల్ నిర్మాణ ప్రాంతంలో తనకు భూమి ఉందన్న ఆరోపణలపై జీఎంఆర్ తీవ్రంగా స్పందించారు.నాకు ఉన్నది కేవలం 5 ఎకరాలే. మీలాగా వందల ఎకరాలు ఆక్రమించలేదని, స్కూల్ స్థలంలో నాకేమైనా సంబంధం ఉందని నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని,నిరూపించలేకపోతే ప్రజలకు క్షమాపణ చెబుతారా?‘ అని సవాల్ విసిరారు. పెన్షన్లు అడిగినందుకు దళిత కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర నీదన్నారు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వారిపైనే ఉల్టా కేసులు పెట్టించారని, జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని కోరినందుకు కార్యకర్తలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన అహంకారివి నీవు అంటూ విమర్శించారు. తన తమ్ముడిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని, తాము సేవ చేయడానికి వచ్చామే తప్ప దోచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. రాబోయే పదేళ్లూ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీస్సులు మాకే ఉన్నాయన్నారు.
సలహాలు ఉంటే ఇవ్వండి, అభివృద్ధిని అడ్డుకుంటే దేవరకద్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. మంచి చేయాలని సంకల్పంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇష్టం సారంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని విమర్శించారు. నిజంగా నువ్వు చేసింది అభివృద్ధి అయితే నాకు సవాల్ ని స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నేతలు నాయకులు ఉన్నారు.






