24-09-2024 12:00:00 AM
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి :
సామాజిక అభివృద్ధి అనేది సమాజంలోని ప్రతి వ్యక్తి శ్రేయస్సును మెరుగు పరచడంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. తద్వారా ప్రజలంతా పూర్తి సామర్థ్యానికి చేరుకోగలుగుతారు. ఈ రకంగా సమాజ విజయం ప్రతి పౌరుని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. సమాజాభివృద్ధి అంటే ప్రజలపై పెట్టుబడి పెట్టడం. పౌరులందరూ ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా తమ కలలవైపు పయనించేందుకు వీలుగా అడ్డంకులను తొలగించుకోవలసి ఉంటుంది. పేదరికంలో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ పేదలుగా ఉండాలని భావించడం సమంజసం కాదు. ప్రజలకు అన్ని విధాల సహాయం చేయడం ద్వారా వారు స్వయంసమృద్ధి సాధనలో ముందడుగు వేసేలా ప్రభుత్వాలు దోహద పడాలి.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎదగడానికి, వారి స్వంత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, కుటుంబాలు, కమ్యూనిటీలకు అర్థవంతమైన మార్గంలో సహకరించడానికి అవకాశాలు ఉండాలి. బాగా చదువుకున్న వారు , శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి శిక్షణతో తగిన వేతనాలను పొందగలగాలి. అప్పుడు వారు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకొని, జీవిత పోరాటంలో విజయవంతం కావడానికి మెరుగైన సన్నద్ధతను పొందుతారు. అదే స్ఫూర్తితో వారి కుటుంబ సభ్యులు కూడా బాగా పని చేస్తారు. ఈ రకంగా మొత్తం సమాజం ప్రయోజనం పొందుతుంది.
కనబడని ఫలితాలు
బడ్జెట్ అంచనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వాలు ఏటేటా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజా జీవితంలో మాత్రం అభివృద్ధి స్పష్టంగా కనిపించడం లేదు. అసంఘటిత రంగంలో ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో పని చేస్తున్న రైతులు, కౌలురైతుల వరకు భూములు కలిగి ఉన్న వాళ్ళు ఏదో రకంగా లబ్ధి పొందుతూనే ఉన్నారు. రైతు లోకానికి సహకారం అందడం, ప్రభుత్వం సాయం చేయడంపైన ప్రజానీకానికి వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు.
కానీ, భూమి లేక రెక్కల కష్టాల్ని మాత్రమే నమ్ముకుని, ఎలాంటి భరోసా పాలక వర్గాల నుంచి అందక ప్రకృతిపైన, దొరికే పనిపైన ఆధారపడి జీవిస్తున్న కోట్లాది ప్రజానీకం పరిస్థితులలో మాత్రం ఆశించిన మేర మార్పు రావడం లేదు. సుమారు 90 శాతంగా ఉన్న పేద, అట్టడుగు, ఆదివాసీ, బలహీన, సామాన్య కార్మికులు, చేతివృత్తుల వాళ్లు, చిరు వ్యాపారులు మొదలైన వర్గాలకు బడ్జెట్లలో వాళ్ల వాటా ప్రకారంగా 90 శాతం దక్కాలి. కానీ, 10 శాతం కూడా దక్కడం లేదని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే భారతదేశ ప్రజాధనం ఎవరి పాలవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు దేశ సంపద 40 శాతం ఒక్క శాతంగా ఉన్నటువంటి సంపన్న వర్గాల చేతిలో బందీ అయింది. ఈ నేపథ్యంలో అసమానతలకు ఇంకా ప్రత్యేకమైన సాక్ష్యాధారాలు చూపవలసిన పనిలేదు. అందుకే, తెలంగాణ రాష్ట్రం సుమారు 3 లక్షల కోట్ల్ల బడ్జెట్ ప్రతిపాదించినా, కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్లకు తన బడ్జెట్‌ను పెంచినా పేదరికం మాత్రం ఈ దేశంలో ఇంకా జడలు విప్పుతూనే ఉంది. అయినా, ప్రభుత్వాలు మాత్రం 77 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా పేదరికం నిర్మూలించలేక పోయామని, ఇది తమ వైఫల్యం అని అంగీకరించడానికి సిద్ధంగా లేవు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ప్రతి రోజూ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు వివిధ ప్రజా వేదికల ద్వారా కోటానుకోట్ల రూపాయలు అప్పటికప్పుడే స్థానిక డిమాండ్ మేరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తుంటారు. ప్రణాళికలలో భాగంగా ఆయా వర్గాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడిస్తుంటారు. అయినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. నిర్మాణాత్మకమైన అభివృద్ధి సాధ్యం కావడం లేదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన సబ్ ప్లాన్ నిధులద్వారా ఆయా వర్గాలకు చెందిన వారు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ చాలినంతగా నిధులు అందడం లేదు. ఈ కారణంగా అనేకమంది స్వయంఉపాధితో కనీస ఆదాయం సంపాదించుకొని పొట్ట పోసుకోవడానికి, తమ పిల్లలను చదివించుకోవడానికి కుటుంబ ఆరోగ్య అవసరాలను తీర్చుకోవడానికి అనివార్యంగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర లక్షల రూపాయలు అప్పు చేయవలసి పరిస్థితి ఏర్పడుతున్నది. మిత్తి కట్టలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న సందర్భాలూ తలెత్తుతుంటాయి.
అణగారిన వర్గాలకు మొండి చెయ్యి
వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో సహా కేంద్రం కూడా రైతులకు ఆసరా పథకాలను ప్రవేశపెట్టిన విషయం గమనించాలి. అదే సందర్భంలో తెలంగాణలో ఇటీవల పెద్దగా ప్రచారంలో ఉన్న రైతుబంధు లేదా రుణమాఫీ వంటి పథకాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కారణంగా కూడా ఏటా బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా, తాజా వరదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎకరానికి 10 15 వేల రూపాయల వరకు పరిహారంగా చెల్లించడానికి హామీ లభించింది. ఈ రకంగా కూడా కోట్ల నిధులు వ్యవసాయ రంగానికి అనివార్యంగా ఖర్చు చేయవలసి వస్తున్నది.
ఒక్క తెలంగాణలోనే గత ఏడేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన 70 వేల కోట్ల రూపాయల రైతుబంధులో సుమారు రూ.30 వేల కోట్లు భూస్వామ్య వర్గానికి, సాగు చేయని భూములమీద ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సోయి లేని ప్రభుత్వాలు నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయవచ్చునా? మరొకవైపు ఏ మాత్రం భూమి లేకుండా రెక్కల కష్టంపైనే ఆధారపడి జీవిస్తున్న వర్గాలకు, వృద్ధులకు పెన్షన్ లాంటిది తప్ప ఏ రకమైన సాయమూ అందలేదు. మన రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగానూ భూమి ఉన్న రైతులకు మాత్రమే అంతో ఇంతో అప్పజెప్తున్న ప్రభుత్వాలు భూమి లేని పేదలు, కౌలు రైతులకు మాత్రం సాయం చేయకపోవడం అన్యాయం.
కారణాలు ఏమైనా, వ్యవసాయ రంగం పెద్ద మొత్తంలో బడ్జెట్ నుండి తన వాటాను పొందుతున్నది. నిధులు పేద వర్గాలకు సరిగ్గా అందక పోవడం, ప్రకృతి విపత్తులతో అనివార్యంగా వ్యవసాయ రంగం మీద అధికభారం పడడం, సంపన్న పెట్టుబడిదారీ వర్గాలకు పరిశ్రమల ఏర్పాటు, ఇతరత్రా రుణమాఫీ పేరున కోట్లాది రూపాయలు ప్రభుత్వాలు భరించడం వంటి చర్యల కారణంగా పెద్ద మొత్తంలో బడ్జెట్ నిధులు 25 శాతం కూడా లేనటువంటి వర్గాలకే అందుతున్నాయి. 75 శాతం ప్రజానీకం తమ రెక్కల కష్టం మీద, చిరు వ్యాపారాల మీద ఆధారపడవలసి వస్తున్నది. వీరికి బడ్జెట్ ద్వారా లభిస్తున్నది నిండు సున్నా.
ప్రభుత్వాలకు కనువిప్పు ఎప్పుడు?
కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే రాజకీయ ఆర్థిక ఉద్యోగ వ్యాపార రంగాలలో గద్దె నెక్కితే అడుగంటిన సామాజిక వర్గాలు ఇప్పటికీ సమగ్రాభివృద్ధికి, చట్టసభలకు, ఉద్యోగ వ్యాపారాలకు ఆమడ దూరంలో ఉంటున్నారు. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకొని ప్రభుత్వ భూమిని, పార్కులను దుర్మార్గంగా సొంతం చేసుకుంటున్న వర్గాల కారణంగా కూడా అనేక ప్రకృతి విపత్తులు, వరదలు ముంచెత్తుతున్న విషయం ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చూడవచ్చు.
దాని నివారణలో భాగంగా తెలంగాణలో హైడ్రా పేరుతో ఆక్రమణలను తొలగించే పని చురుకుగా సాగుతున్నది. ఇది గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించి, పేద వర్గాలకు కనీసం 60 గజాల జాగా లభించినా సంతోషమే. భూ సంస్కరణల కోసం భూ పోరాటాలు, తమ వాటా కోసం అన్ని వర్గాల ప్రజా ఆందోళనలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం అన్ని సామాజిక వర్గాల ప్రతిఘటనోద్యమాలు ముక్తకంఠంతో కొనసాగినప్పుడు మాత్రమే ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు కనువిప్పు కలుగుతుంది.