25-09-2024 12:00:00 AM
కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులను తమ దేశంలోకి ప్రవేశించకుండా మరోసారి కఠిన ఆంక్షలు విధిస్తోంది. భారతీయ విద్యార్థులపైనే ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఇప్పటికే కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లలో భారీగా కోతలు విధించింది. అలాగే, వచ్చే సంవత్సరం కూడా మరో 10 శాతం తగ్గించనున్నట్లు వెల్లడించింది. కెనడాలోకి వలసల నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
తమ దేశంలో తాత్కాలిక వలస నివాసితుల సంఖ్య బాగా పెరుగుతున్నదని, అందువల్ల ఈ కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పటం లేదని కెనడా ప్రభుత్వం నిష్కర్షగా చెపుతోంది. ముఖ్యంగా మన భారతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతుంది. ఈ తాజా నిర్ణయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ‘ఎక్స్’ వేదికగా ఇటీవల ప్రకటించారు.
“గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో 35 శాతం తక్కువగా విదేశీ విద్యార్థులకు స్టూడెంట్ పర్మిట్లు మంజూరు చేస్తున్నాం. వచ్చే ఏడాది ఈ సంఖ్యను మరో 10 శాతానికి తగ్గిస్తాం” అన్నారు. “మన ఆర్థిక వ్యవస్థకు వలసలు ముఖ్యమే. అయినా, కొందరు చెడ్డ వ్యక్తులు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే, మేం వాటిని నియంత్రించక తప్పడం లేదు” అని కెనడా ప్రధాని జెస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు.
కాగా, గత నెలలో భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తుంటే, వారిలో 4.27 లక్షల మంది కెనడాలో ఉంటున్నారు. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న విదేశీ విద్యార్థులలో 40 శాతం మంది భారతీయులే ఉండడం గమనార్హం.
ఈమధ్య కాలంలో మన దేశానికి కెనడాకు మధ్య విదేశాంగ వి ధానాల్లో అపోహలు చోటుచేసుకున్నాయి. తమ దేశ సిక్కు పౌరుడిని అమెరికాలో భారత సీక్రేట్ ఏజెన్సీ రీసెర్చ్ ఎనాలిసిస్స్ వింగ్ (రా) హతమార్చేందుకు పూనుకొందని, దానిని అమెరికా సీక్రేట్ ఏజెంట్లు గుర్తించారని తీవ్రమైన ఆరోపణను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ దేశ పార్లమెంటులో చేశారు.
ఈ నిరాధార ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాలు తమ రాయబారులను వెనుకకు పిలుపించుకున్నారు. అప్పటి నుండి భారత- కెనడా సంబంధాలలో మార్పులు వచ్చాయి. ఆ ప్రభావం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులపై పడింది. ఈ పరిస్థితులు ఎప్పుడు మెరుగు పడతాయో ఇప్పుడే చెప్పలేం.
డా. కోలాహలం రామ్ కిశోర్