ఢిల్లీలో ఒంటరిగానే పోటీ
ఇండియా కూటమితో పొత్తు ఉండదు
ఆప్ చీఫ్ కేజ్రీవాల్ స్పష్టం
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో పొత్తు లు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇండియాకూటమితో కలిసి వెళ్లలేమని కుండబద్ధలు కొట్టారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్ నిరాకరించి 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమం లో ఢిల్లీలో ఆప్, ఇండి యా కూటమి, బీజేపీ మధ్య జరిగే త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. ఢిల్లీలో క్షీణించిన శాంతిభద్రతల విషయంలో కేంద్రహోం మంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారని ఆశించానని, అయితే శనివారం పాదయాత్ర చేస్తున్నప్పుడు తనపైనే దాడి జరిగిందన్నారు.
తాము ప్రజాసమస్యలను లేవనెత్తుతున్నందుకే తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అయితే కేజ్రీ ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందిస్తూ ప్రజల సానుభూతి కోసమే ఈ డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.






