హెచ్‌సిటీ పనులను త్వరగా పూర్తి చేయండి
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
- నగరంలో ప్రాజెక్ట్‌ల రూపకల్పనకు 10 మందితో ఇన్ హౌజ్ డిజైన్ వింగ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్‌సిటీ, ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్ట్ వారిగా టైమ్ లైన్ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్‌లో మంగళవారం కమిషనర్ కర్ణన్ నగరంలోని అన్ని జోన్‌లలో చేపడుతున్న హెచ్‌సిటీ ప్రాజెక్టులు, స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇంజనీరింగ్ అధికారులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్ట్ పురోగతిని కమిషనర్‌కు వివరించారు. ఈ సంద ర్భంగా ప్రాజెక్టు పనుల వేగంగా పూర్తికి కమిషనర్ కర్ణన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూ సేకరణ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మెట్రో, రైల్వే అధికారులతో సమన్వ యం అవసరం ఉంటే జోనల్ కమిషనర్ లకు తెలియజేయాలన్నారు.
పనులకు సం బంధించిన డిజైన్‌ల రూపకల్పనకు ప్రైవేట్ కన్సల్టెంట్‌ల పై ఆధారపడటం తగ్గించేందుకు, డిజైన్‌లను వేగంగా ఖరారు చేసేందు కు సీనియర్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల నేతృత్వంలో ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో విద్యనభ్యసించిన జీహెచ్ ఎంసీ ఇంజనీర్లు 10 మందితో ఇన్ హౌజ్ డిజైన్ వింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎస్‌ఈ నేతృత్వంలో 10 మంది తో కూడిన డిజైన్ వింగ్‌లో సీనియర్ ఇంజనీర్లతో పాటు ప్రతిష్టాత్మక ఐఐటి ఎన్‌ఐటిలో చదివిన జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లకు చోటు కల్పించారు.






