30 August, 2026 | 1:55 AM

ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

30-08-2026 01:06 AM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి సర్ ప్రక్రియపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నోటీసుల జారీ, పరిష్కార చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలని, ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులో విచారణ చేపట్టాలని, సంబంధిత రికార్డుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.

నోటీసుల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, పెండింగ్‌ ఉన్న అన్ని నోటీసులను సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా అందజేయాలని, నోటీసులు అందజేసిన రోజు నుండి 7 రోజుల గడువులోగా విచారణ నిర్వహించాలని సూచించారు. అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందచేసి  సంబంధిత వ్యక్తులు క్లెయిమ్స్, అభ్యంతరాల సందర్భంగా సమర్పించాల్సిన పత్రాలు, ఆధారాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ప్రక్రియ కొరకు నియమించిన ఏఈఆర్ఓలకు శిక్షణ ఇవ్వాలి.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ పారదర్శకమైన తప్పులులేని ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యంగా జరుగుతున్న  ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేస్తామని  తెలిపారు. జిల్లాలో 11,739 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు, 20,685 మంది అనామలీస్  ఓటర్లు మొత్తం 32,424 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. నోటీసులు జారీ చేసిన  ఓటర్లు నిర్దేశిత తేదీల్లో విచారణకు హాజరై ఎన్నికల సంఘం ఆదేశాల ధ్రువీకరణ ఆధారాలను సమర్పించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీటి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.