ప్రజా పాలనలో పల్లెల్లో సమగ్ర అభివృద్ధి
ఆత్మకూరు, జూన్ 12 (విజయక్రాంతి):.పార్టీలకతీతంగా ప్రతీ గ్రామాన్ని ఆదర్శ గ్రా మంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూనే, మరోవైపు ఆర్టీసీ సంస్థకు సైతం మంచి ఆర్థిక బలాన్ని చేకూరుస్తోందన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలకుల చేతుల్లో గ్రామాల్లో అభివృద్ది నిరాదరణకు,నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.






