17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాంగ్రెస్, బీజేపీలవి చీప్ రాజకీయాలు

29-05-2025 02:02 AM

- ఎన్డీఎస్‌ఏ నివేదికను ఎల్‌అండ్‌టీ తిరస్కరించడం ఆ పార్టీలకు చెంపపెట్టు

-  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు

- యూకే తెలుగు బిజినెస్ కౌన్సిల్ సమావేశానికి హాజరు 

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి):  కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికీ చీప్ క్వాలిటీది కాదని, తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలే చీప్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ విమర్శించారు.

కనీస పరీక్షలు చేయకుండా, ఎలాంటి శాస్త్రీయ డేటాను సేకరించకుండానే తయారుచేసిన ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్‌ను నిర్మాణసంస్థ ఎల్‌అండ్‌టీ తిరస్కరించడమే ఇందుకు సాక్ష్యమ న్నారు. బుధవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడానికే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓ అశాస్త్రీయ నివేదికను ఇచ్చిందన్న నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయాడ్రామాకు తెరతీశాయన్నారు.

ఆ తప్పుల తడక నివేదికతో కాంగ్రెస్, బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.  కేవలం ఓ నీచమైన ఊహ ఆధారంగా క్రూరమైన రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో ఆ రిపోర్ట్‌ను తయారుచేశారని ఆరోపించారు. 

యూకేలోనూ రజతోత్సవ సంబరాలు.. 

భారత రాష్ర్ట సమితి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబురాల్లో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్ యూకేలోను పార్టీ రజతోత్సవ సంబరాలను నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి పార్టీ ఎన్నారై నేతలతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి వచ్చిన ఓ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు.

పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు ఇంగ్లాండ్‌లో కూడా నిర్వహించాలని ఎన్నారైలను కేటీఆర్ కోరారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో జూన్ 1వ తేదీన సిల్వర్ జూబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, ఇదే క్రమంలో యూకేలోను సంబురాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ కోసమే.. 

అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం త్రికరణశుద్ధిగా తాము పనిచేస్తూనే ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ సాధకులుగా, మాతృభూమిపై తమకుండే మమకారం ఇంకెవరకీ ఉండదన్నారు. యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు బుధవారం కలిశారు.

ఈ సందర్భంగా రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వ్యాపార నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై సమావేశంలో చర్చించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, తీసుకువచ్చిన పారదర్శక విధానాలతో పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.