calender_icon.png 14 February, 2026 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో విఫలమైన కాంగ్రెస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు

14-02-2026 10:53:57 AM

సత్తా చాటిన బీఆర్ఎస్ అధ్యక్షుడు

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ ఎన్నికలలో పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అభ్యర్థుల గెలుపులో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు కీలక పాత్ర పోషించాల్సి ఉండగా జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో అది మచ్చుకైనా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉండి ఆ మున్సిపాలిటీ నుంచి బరిలో ఉన్న 22 వార్డులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. కేవలం ఏడుగురిని మాత్రమే గెలిపించుకొని చైర్మన్ పీఠాన్ని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు వదిలేశారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు చెన్నూర్ పట్టణంలో నివాసముంటున్నారు. చెన్నూర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో 18 వార్డుల్లో కేవలం రెండు వార్డులను మాత్రమే గెలిపించుకోగలిగారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎంఎల్ఏ బాల్క సుమన్ కు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో సొంత ఇల్లుండగా ఈ మున్సిపాలిటీ నుంచి 22 వార్డులలో బీఆర్ఎస్ పది సీట్లను, అలయన్స్ లో పోటీ చేసిన సీపీఐ నాలుగు సీట్ల గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. జిల్లా అధ్యక్షులు నివాసమున్న ప్రాంతంలో కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు ఓటమి చవిచూడటంపై పలు విమర్శలు పెల్లుబుకుతున్నాయి.