calender_icon.png 17 February, 2026 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్–బీజేపీ సయోధ్య

17-02-2026 02:08:08 PM

చైర్మన్ కాంగ్రెస్… వైస్‌ చైర్మన్ బీజేపీ

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో(Kagaznagar Municipality) చైర్మన్ పదవి ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని విధంగా కాగజ్‌నగర్‌లో కొత్త రాజకీయ సమీకరణకు నాంది పడింది. సాధారణంగా పరస్పర విభిన్న సిద్ధాంతాలు కలిగిన జాతీయ పార్టీలు అయిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ స్థానిక రాజకీయ అవసరాల దృష్ట్యా పరస్పరం మద్దతు ఇచ్చుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి అవసరమైన మెజార్టీ కోసం స్థానిక స్థాయిలో రాజకీయ లెక్కలు మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ రెండు పార్టీలు, ఇప్పుడు అధికార సమీకరణాల నేపథ్యంలో కలిసి పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్ధాంతాల కంటే అధికారమే ప్రధానమనే ధోరణి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, టీఆర్‌ఎస్‌కు 11, కాంగ్రెస్‌కు 9, బీజేపీకి 5, ఎంఐఎంకు 1, స్వతంత్రులకు 4 వార్డులు దక్కాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి 16 మంది సభ్యుల మెజార్టీ అవసరం కాగా, ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు.

టీఆర్‌ఎస్‌కు స్వతంత్రులు, ఎంఐఎం మద్దతు తెలిపినా వారి సంఖ్య 14కే పరిమితమైంది. బుధవారం పురపాలక కార్యాలయానికి సభ్యులు హాజరైనప్పటికీ కోరం లేక సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు కుదిరి, చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు, వైస్‌ చైర్మన్ పదవి బీజేపీకి ఇవ్వాలనే ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. దీని మేరకు గురువారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన షాహిన్ సుల్తానా చైర్మన్‌గా, బీజేపీకి చెందిన గజ్జల లావణ్య వైస్‌ చైర్మన్‌గా ఎన్నికై పదవులు దక్కించుకున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో మతపరమైన భావోద్వేగాలు, జాతీయ రాజకీయ అంశాలను ప్రస్తావించి ఓట్లు పొందిన పార్టీలు, ఇప్పుడు స్థానిక రాజకీయ ప్రయోజనాల కోసం పరస్పరం కలిసి పనిచేయడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.