7 April, 2026 | 1:01 PM

కాంగ్రెస్‌కు రైతులపై పట్టింపు లేదు

07-05-2024 01:07 AM

మంచిర్యాల, మే 6 (విజయక్రాంతి): రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం సాయంత్రం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి మందమర్రి మండలంలోని సారంగపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా, వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో యాసంగిలో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. చిల్లర రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ రైతులపై పెట్టడం లేదని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటి వరకు 220 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్‌కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.