బీఆర్‌ఎస్ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్ ఆగ్రహం
బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్ ఆగ్రహం
కాంగ్రెస్ నేతలు భూములను కబ్జా చేస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, ఇతర నేతల అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఇతర నేతలను అక్రమంగా గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని కేటీఆర్ అభివర్ణించారు.
ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఫైర్ అయ్యారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్(Industrial Park) పేరుతో రైతుల నుండి 1200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మరిచి పేదల భూములపైన పడిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమన్నారు. గత రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని రేవంత్ సర్కార్, భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్లు భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదని, ఉద్యమ కాలం నుండే ఇవన్నీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామని కేటీఆర్ తెలిపారు. రేవంత్ ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం ఆగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరించారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అక్రమంగా నిర్బంధించిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని, భూ సేకరణను వెంటనే ఆపేయాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




