ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నావు
మోసం చేసి మళ్లీ మా ఊరొచ్చావా..
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రైతుల ఆగ్రహం
బీఆర్‌ఎస్ ప్రచారం అడ్డగింత
మన్నెవారిపల్లిలో ఉద్రిక్తత
అచ్చంపేట, మే 6: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నిరసన సెగ తగిలింది. సోమవారం అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లిలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుండగా గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు మెరుగైన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని ఇప్పిస్తానని ఓట్లు వేయించుకొని, చివరకు మోసం చేస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మరోసారి ఈ గ్రామానికి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వచ్చావు అంటూ నిలదీశారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.




