స్థానికేతరుడు మల్లు రవిని ఓడించాలి
వనపర్తి, మే 6 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న స్థానికేతరుడు మల్లు రవిని ఓడించాలని, బీఆర్‌ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మాదిగల రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మగౌరవ సభకు ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అధికారం కోసం సీఎం రేవంత్ లాగా అబద్ధాలు చెప్పి ఓట్లు అడగనని చెప్పారు. గురుకులాల కార్యదర్శిగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దానని గుర్తుచేశారు. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తుందని ఆరోపించారు. బీజేపీ హయాంలో దళితులపై వివక్ష పెరిగిందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ పాల్గొన్నారు.




