హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
l మైనార్టీలనూ మోసం చేసింది
l మాజీ మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి వందరోజలు గడిచినా ఆరు గ్యారెంటీలు అమలుచేయడంలో విఫలమైందని మాజీ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పుడూ అన్యాయమే చేస్తుందని, మైనార్టీలనూ మోసం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం మాట్లాడుతూ.. సెక్యులర్ పార్టీగా చెప్పుకోవడం తప్ప ఆ దిశగా పనిచేయడం లేదని, దేశంలో లౌకికవాదం పాటించేది ప్రాంతీయ పార్టీలేనని అన్నారు. ఈ భావాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
గ్రేటర్‌లో కరెంటు కోతలు పెడుతోందని, తమ ఇంట్లోనూ కరెంటు పోతుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాత గృహజ్యోతి పథకం పూర్తిగా మరిచిపోవాల్సిందేనన్నారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, 204 రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి లక్షమంది విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ అమలు చేస్తామంటే, రేవంత్‌రెడ్డి గుజరాత్ మోడల్ అంటున్నారని, ఇద్దరి మధ్య తేడా వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. కేసీఆర్ అభివృద్ధిని చూసే రాహుల్ తెలంగాణ మోడల్ అంటున్నారని చెప్పారు. తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబాన్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల్లో మార్పు మొదలైందని త్వరలో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 12 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఖతం అయ్యే పార్టీ కాదని, కాంగ్రెస్ నేతల మాటలు విని మోసపోయామని మైనార్టీలు చెబుతున్నారని వెల్లడించారు.






