రేవంత్ హూందాగా లేరు
l ప్రజా సమస్యలపై అవగాహన కూడా లేదు
l బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హూందాగా వ్యవహరించడంలేదని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ విమర్శించారు. నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి చెందుతామనే భయంతో ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, మార్పు అంటే ఏమిటో చూద్దామని ప్రజలు ఓట్లు వేస్తే పథకాలు అమలు చేయకుండా తప్పించుకునే పనిలో పడ్డారని ఎద్దేవాచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేసి పంట పొలాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌కే దక్కుతుందన్నారు. ప్రజాదర్బార్ పేరుతో ఒకరోజు ప్రజాభవన్‌లో కూర్చొని తరువాత దానిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాజకీయ దళారి రేవంత్‌రెడ్డికి ప్రజలపై ఎటువంటి ప్రేమ లేదని, ఉదయం లేచి కేసీఆర్‌ను విమర్శించడం తప్ప ప్రజా సమస్యలపై ఎటువంటి అవగాహన లేదన్నారు.
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా చేశారని, అలాంటి వ్యక్తి వయనాడ్‌లో రాహుల్‌గాంధీని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారని, డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చే సంస్కృతి రేవంత్‌రెడ్డికి ఉందన్నారు. కేసీఆర్ మీద బట్టకాల్చి మీద వేస్తే, కర్రు కాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.






