22 July, 2026 | 2:40 AM

కాంగ్రెస్ మస్కా

22-07-2026 02:09 AM

న్యూఢిల్లీ, జూలై ౨౧:  ప్రధాని నరేంద్రమోదీ నివాసం వద్ద ధర్నాకు కాంగ్రెస్ పక్కా స్కెచ్ వేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజును అవకాశంగా మలుచుకుంది. భద్రతా దళాలు, నిఘా వ్యవస్థల అంచనాలకు అందకుండా ప్రధాని నివాసానికి దూసుకెళ్లి మెరుపు ధర్నాకు దిగింది. ఊహించని ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంగళవారం ఖర్గే 84వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు, ఎంపీలతో కలిసి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఖర్గే నివాసం నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి 2.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని నిరసనకు దిగారు. ముందుగా విజయ్ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాలని కాంగ్రెస్ భావించింది.

సమాచారం లీక్ కావడంతో పోలీసులు అప్రమత్తమై పార్లమెంట్ సమీపంలో భద్రతను పెంచారు. పాత ప్లాన్ ప్రకారం వెళితే పోలీసులు అడ్డుకుంటారని గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం, ఖర్గే బర్త్‌డేను అవకాశంగా తీసుకొని ప్రధాని ఇంటి ముట్టడికి వ్యూహం రచించింది. పక్కా వ్యూహంతో నిరసన కార్యక్రమాన్ని పూర్తి చేసింది.