22 July, 2026 | 1:26 AM

కన్జర్వేషన్ జోన్‌లో.. ‘మై ల్యాండ్’ మాయాజాలం!

22-07-2026 12:35 AM

అనుమతులు నిల్..  దందాలు ఫుల్..

  1. లేఅవుట్ నిబంధనలకు నీళ్లు వదిలేసిన రియల్ మాఫియా
  2. పట్టించుకోని యంత్రాంగం.. రోడ్డున పడుతున్న రైతులు
  3. ఏకంగా 25 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు

చేవెళ్ల, జూలై 21 (విజయక్రాంతి): చట్టా లు వారికి చుట్టాలయ్యాయి.. అధికారుల ఉదాసీనత వారికి ఆయుధమైంది! నిబంధనలను కాగితాలకే పరిమితం చేస్తూ, కన్జర్వేషన్ జోన్ను సైతం కమర్షియల్ వ్యాపారానికి వేదికగా మార్చేసింది ’మై ల్యాండ్’ యాజమాన్యం. చేవెళ్ల నియోజకవర్గంలోని ఆలూరు రెవెన్యూ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ రూ.కోట్ల అక్రమ వెంచర్ల దందా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, అమాయక రైతుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ‘మాఫియా’ ఆగడాలకు తిరుగులేకుండా పోయింది.

అది కన్జర్వేషన్ జోన్.. కానీ సాగుతోంది కమర్షియల్ వెంచర్!

ఆలూరు-1, 2, 3 రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 189, 90, 9లలో 15.00 ఎకరాలు, అలాగే ఆలూరు-2 పరిధిలోని సర్వే నంబర్లు 51, 52, 53లలో మరికొంత భూమి... ఇలా మొత్తం 25 ఎకరాలకు పైగా ఉన్న ’కన్జర్వేషన్ (సంరక్షిత) జోన్’ భూమిలో ఈ అక్రమ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. పచ్చని ప్రకృతిని కాపాడాల్సిన చోట, సిమెంట్ కాంక్రీట్ జంగిల్ను నిర్మిస్తుండటం గమనార్హం.

అనుమతులు శూన్యం.. చక చక నిర్మాణాలు...

సాధారణంగా కన్జర్వేషన్ జోన్లో ఎలాంటి కమర్షియల్ నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ  కానీ, స్థానిక పంచాయతీ కానీ అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ, ఇవేమీ పట్టని ’మై ల్యాండ్’ యాజమాన్యం..హెచ్‌ఎండీఏ, పంచాయతీ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించింది.ఫామ్ ల్యాండ్ అని పైన రంగుల కలలు చూపిస్తూ, లోపల విశాలమైన కాంక్రీట్ రోడ్లు, మోడల్ హౌస్లను అక్రమంగా నిర్మించేస్తోంది.

నాయకుడి అండ.. అధికారుల దండ?

స్థానికంగా ఉన్న ఓ అధికార పార్టీ నేత అభయహస్తంతోనే ’మై ల్యాండ్’ యజమానులు ఈ స్థాయిలో చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.ప్రభుత్వ అనుమతులు లేని ఈ వెంచర్లలో పెట్టుబడులు పెట్టి అమాయక ప్రజలు, రైతులు నష్టపోకముందే అధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.