22 July, 2026 | 2:41 AM

పనుల్లో అలసత్వం వద్దు

22-07-2026 02:05 AM
  1. కొడంగల్ ఎత్తిపోతల పనులు సకాలంలో పూర్తి చేయాలి 
  2. భూ నిర్వాసితులకు వారం రోజుల్లో ఇంటి పట్టాలివ్వాలి 
  3. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 
  4. హకీంపేట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులపై సమీక్ష

కొడంగల్, జూలై 21 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట్‌లో చేపడుతున్న ఎడ్యుకేషన్ హబ్ యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాదు నుంచి హెలికాప్టర్‌లో దుద్యాల మండలం హకీంపేట్ గ్రామానికి చేరుకున్నారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

నిర్మాణ పనులు నిదానంగా సాగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి చేశారు. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతంగా కొనసాగాలని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్ లో  పనులకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. పనులు అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల పట్టాల కేటాయింపులపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు వారం రోజుల్లో ఇంటి పట్టాలను లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ ప్రభుత్వ ఉన్నత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనపు పంపు ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులు అన్నింటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సెప్టెంబరులోగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. మూడవ పంపు ఏర్పాటు కోసం అవసరం అయిన సివిల్ పనులన్నీ తనిఖీ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను  ముఖ్యమంత్రి ఆదేశించారు.

పనుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే అవసరమనుకుంటే సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి అధికారును హెచ్చరించారు. మొదటి విడత పనులు డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని చెప్పిన ఇంజనీరింగ్ అధికారులు.. డిసెంబర్ 2027 వరకు ప్రతినెల ఎంత మేర పనులు పూర్తి చేయగలుగుతారు సంతకాలతో సహా వివరించాలని అధికారులను సూచించారు.

సీఎం వెంట ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాసరాజ్ హోసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టికే శ్రీదేవి, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టియన్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీధర్, టిజి ఐసిబిసి, ఎండి శశాంక, కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి ఉన్నారు.