సీజేపీ పోరు డబుల్
- విద్యార్థులపై లాఠీచార్జ్జికి నిరసన
- విపక్ష నేతలు కేజ్రీవాల్, శరద్ పవార్ మద్దతు
న్యూఢిల్లీ, జూలై 21: న్యూఢిల్లీలో సోమవారం సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొ న్న విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా, రెండో రోజు మంగళవారం సీజేపీ నేతలు జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు. వందలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు మద్దతు ప్రకటించారు.
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఈ ఆందోళనలో పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల గొంతును బలవంతంగా నొక్కేయాలని చూస్తోందని కానీ అది సాధ్యం కాదని పేర్కొన్నారు. సక్రమమైన, పారదర్శకమైన పరీక్షా విధానం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.
ఎన్సీపీ (ఎస్పీ) లోక్‌సభ సభ్యురాలు సుప్రి యా సూలే మాట్లాడుతూ.. విద్యార్థుల న్యా యమైన డిమాండ్ల కోసం పార్లమెంట్ లోపల, వెలుపల పోరాడతామన్నారు. ఢిల్లీ శాసనసభ ప్రతిపక్ష నాయకురాలు అతిశీ నిరసనకారులను కలిసి సంఘీభావం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమ స్యలను, డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తోందని అతిశీ ఆరోపించారు. లాఠీచార్జీలో గాయపడ్డ క్షతగాత్రులను కేంద్రమంత్రి జేపీ నడ్డా పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం క్షతగాత్రులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం పరామర్శించి భరోసా ఇచ్చారు.
‘మేదాంత’కు వాంగ్‌చుక్
- సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి n ఢిల్లీ హైకోర్టు ఆదేశం
సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి మంగళవారం రాత్రి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వుల మేరకు ఆయనను మేదాంత వైద్యుల బృందానికి అప్పగించారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు నిరసనగా ఆయన జూన్ 28 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు.
సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయానికి ఆయన ప్రాథమిక ఆరోగ్య సూచీలు స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రక్తం కొలతల్లో పాన్ సైటోపేనియా సమస్య కొనసాగుతుండగా, పొటాషియం స్థాయి 3.4 ఎంఈక్యు/ఎల్గా నమోదైనట్లు వివరించారు. సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.






