22 July, 2026 | 1:42 AM

ఎల్ నినో కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువే!

22-07-2026 12:30 AM
  1. గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోస్తలేరు
  2. దేవాదులపై సీఎంకు, మంత్రులకు అవగాహన లేదు
  3. సాగునీటి కోసం వరంగల్ రైతుల ఆందోళనలు
  4. ట్యాంకర్లు, బిందెలతో పంటలకు నీళ్లు 
  5. ప్రభుత్వం కళ్లు తెరవకుంటే ప్రజా ఉద్యమం
  6. మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ‘ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. సాగునీటి కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్లు, బిందెలతో నీళ్లు పడుతూ పంటల ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా రైతుల గోస ప్రభుత్వానికి పట్టడం లేదు. గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోస్త లేరు?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

దేవాదుల పంపులు ఆన్ చేయాలని బీఆర్‌ఎ స్ నిలదీస్తే అప్పుడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెలికాప్టర్‌లో వెళ్లి హడావుడి చేశారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా నీళ్ల మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. దేవాదుల 10 మోటార్లు నడిపి 22 రిజర్వాయర్లు నింపాలని, 3 లక్షల 17 వేల ఎకరాలకు సాగునీటితో పాటు ప్రజలకు సాగు నీరు అం దించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల రైతులతో కలిసి ప్రజాపోరుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. 22 రిజర్వాయర్లు నింపుతామని, 38 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి రైతులు వరి నార్లు పోశారని, ఇప్పుడు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ నిర్మించిన సమ్మక్క బరాజ్‌లో 3 టీఎంసీల నీరు నిల్వ ఉందని, బరాజ్‌లోకి 22 వేల క్యూసెక్కుల వరద ఉందని, అయినా ఆయకట్టు సరిపడా నీరివ్వడం లేదన్నారు. దేవాదుల 10 పంపులు నడుస్తాయని మంత్రులు చెప్పారని, నిన్నటి వరకు ఐదు పంపులే నడిచాయన్నారు. మంత్రులు వెళ్లినప్పుడే ఏడు మోటార్లు నడుస్తున్నాయని, వాస్తవానికి మూడు మోటార్లు నడుపుతున్నారని ఆరోపించారు.  

నీళ్ల ఎత్తిపోతలోనూ వాయిదాలే..

ఇది తుగ్లక్ ప్రభుత్వమని, రాష్ట్రాన్ని నడిపే పద్ధతి ఇదేనా? అని విమర్శించారు. రైతు బోరు ఎండితే నీళ్ల కోసం రకరకాల మార్గాలు వెతుకుతాడని, కానీ ప్రభుత్వం ఎందుకు తపన పడటం లేదో చెప్పాలన్నారు. రైతులు ట్యాంకర్లు, బిందెలతో పంటలకు నీళ్లు పెడుతున్నా రేవంత్‌రెడ్డికి సోయి లేదన్నారు. గ్యారెంటీల అమలులో వాయిదాల లెక్కనే.. నీళ్ల ఎత్తిపోతల విషయంలో కూడా వాయిదాలే అని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం అంటే తమ మీద పడి ఏడ్చారు.. మరి దేవాదుల వద్ద ఏం అడ్డం వచ్చింది?, ఇప్పటి వరకు ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదన్నారు. ఎల్ నినో పేరుతో నీళ్లకు ఎగనామం పెడితే ఊరుకోమని హెచ్చరించారు. దేవాదుల, సమ్మక్క బరాజ్‌ల నుంచి 105 టీఎంసీల నీళ్లు ఏపీ వైపు వెళ్లిపోయాయని, మీరు ఎత్తింది కేవలం 1.9 టీఎంసీలు మాత్రమేనన్నారు.

దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని 22 రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలని, నీటిని ఎత్తిపోస్తే 50 రోజుల్లో అన్నీ నిండేవన్నారు. దేవాదుల వద్ద 78 మీటర్ల లెవల్‌లో గోదావరి ప్రవహిస్తోందన్నారు. నీటిని ఎత్తిపోయడంలో విఫలమైన మంత్రులు.. రైతులకు క్షమాపణలు చెప్పాలని డమాండ్ చేశారు.  

నీళ్లడిగితే మాపై యుద్ధమా?

‘జనగామ, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుంది. దేవాదుల పూర్తి చేస్తామని డైలీ సీరియల్‌లాగ ఎన్నిసార్లు చెబుతారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతటికీ దేవాదుల నీళ్లు పారాయన్నారు. కేసీఆర్ నీళ్ల కోసం యుద్ధం చేస్తే.. మీరు మాపై యుద్ధం చేస్తున్నారని విమర్శించారు.

తాము కాళేశ్వరం గురించి మాట్లాడితే తమ్మిడిహట్టి ప్రాజెక్టు కడతామంటున్నారని, 30 నెలలుగా తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి ఇచ్చారా? అని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో తెలియదు, బేసిన్లు అంటే ఏమిటో తెలియదన్నారు.

చిల్లర రాజకీయాలు మానుకొని తాగు, సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.  సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రాజయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

విడిచిపెట్టడమా.. ఒడిసిపట్టడమా?

చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? తెలంగాణ రైతులకు నీళ్లు ఒడిసిపట్టడమా? మీ ఆలోచన ఏమిటి? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టారని పేర్కొన్నారు. 3.17 లక్షల ఎకరాల ఆయకట్టు కు నీళ్లివ్వడానికి తాము దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. గత ఏడాది 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ఆన్ చేయడం వల్ల రూ.700- కోట్ల విలువైన పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. గోదావరిలో నీరున్నా ఒడిసిపట్టకుండా విడిచిపెడుతున్నారని పేర్కొన్నారు.

కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా డ్రామాలు చేశారని ఆరోపించా రు.  వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వం, నాట్లు వేయొద్దని చెబుతుంటే.. మంత్రులు మాత్రం 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామనడం విడ్డూరంగా ఉం దన్నారు. పొంతన లేటి మాటలతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రామప్ప కింద తూములు మూసేశార ని, నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏమిటన్నారు. గోదావరిలో నీళ్లున్నాయని, అయినా కలెక్టర్ ఎందుకు తూములు మూశారు? అని ప్రశ్నించారు.