22 July, 2026 | 2:12 AM

విద్యార్థుల ఘోస తగులుతుంది!

22-07-2026 01:40 AM
  1. నీట్ నిందితులను రక్షిస్తున్న కేంద్రం
  2. శాంతియుత దీక్షల భగ్నం ప్రజాస్వామ్య విరుద్ధం
  3. సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యంపై కేంద్రమే భాద్యత వహించాలి
  4. రైటర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
  5. హైదరాబాద్‌లో సీజేపీ మద్దతుదారులు, విద్యార్థుల ఆందోళన

ఖైరతాబాద్, జూలై 21 (విజయక్రాంతి): శాంతియుత దీక్షలను భగ్నం చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమని, వేలాది మంది నీట్ విద్యార్థుల భవితవ్యంతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడటం సరికాదని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి కనీసం వారి కుటుంబ సభ్యులకు సైతం చూపకుండా ఇతర ప్రాంతానికి తరలించడం ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా వేలాది మంది నీట్ విద్యార్థులు మంగళవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఆందోళనను ఉద్దేశించి ఆకునూరి మురళి మాట్లాడుతూ.. సోనమ్‌వాంగ్ చుక్ చేస్తున్న శాంతియుత దీక్షకు ప్రజా మద్దతు ఉందని, ఆయనను సందర్శించి పరామార్శించేదుకు వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రావటం ప్రజాభిమానానికి అద్దం పడుతుందన్నారు.

నీట్ పరీక్షలో జరిగిన అవకత వకలను సరిదిద్దాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేయటంతో పాటు శాంతియుత దీక్షలను ఉక్కుపాదంతో అణిచివేసి రాక్షసానందం పొందేందుకు ప్రయత్నించడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. 

ప్లకార్డులతో విద్యార్థుల నిరసనలు

నీట్ పరీక్షపై ప్రభుత్వ నిర్లక్షాన్ని ఎండగడుతూ, సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నంపై నీట్ విద్యార్థులు కదం తొక్కారు. మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వందల సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బారులు తీరారు. ప్లకార్డులను చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం సాయంత్రం నీట్ విద్యార్థులు, వారి తల్లిదండులతో శాంతియుతంగా నిరసన చేపట్టారు. ట్యాంక్‌బండ్ ఇరు మార్గాల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వైపు రావటంతో వారిని వారించేందుకు పోలీసుల తరం కాలేదు. ఒక్కసారిగా వందల సంఖ్యలో విద్యార్థులు రావటంతో ట్యాంక్‌బండ్ ప్రాంతం విద్యార్థులతో నిండిపోయింది.