15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

పాలనకు పరాకాష్ట ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటన

22-02-2026 12:24 AM

కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

కమీషన్లపై పెట్టే శ్రద్ధ కార్మిక సంక్షేమంపై పెడితే విషాదాలు పునరావృతం కావు

అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృత దేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయిన వారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానసిక క్షోభ కు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీత, సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావని హితవు పలికారు.  

రాజకీయాలకు ఏఐ సమ్మిట్‌ను ఎంచుకోవడం విచారకం

అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్- కేటీఆర్ మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయని, ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వంటి అంతర్జాతీయ సదస్సు కచ్చితంగా దానికి వేదిక కాదని స్పష్టం చేశారు. వారి సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ఏఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రమని ఎద్దేవా చేశారు.