31 July, 2026 | 10:53 AM

కేసీఆర్, హరీశ్‌రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

03-09-2025 12:45 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2, (విజయ క్రాంతి):కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత 21 నెలలుగా కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ పాల్వంచ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు గల అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాల్వంచ పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, జిల్లా మహిళా నాయకురాలు కాలేరు సింధు తపస్వి, జిల్లా బిఆర్‌ఎస్ నాయకులు భూక్య చందు నాయక్ తదితరులు మాట్లాడుతూ... 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే తపనతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. 

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటు వంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ ప్రాజెక్టును కట్టకుండా ఆపాలని, ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కేసీఆర్ ను భవిష్యత్ తరాలు మర్చిపోరని కుట్రతో కోర్టులలో కేసులు వేసినా అవన్నీ లెక్కచేయకుండా కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు.

అది జీవించుకోలేని కాంగ్రెస్ పార్టీ 2023 లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 21 నెలలుగా కాలేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు రూ లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని అసత్య ఆరోపణలు చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి రూ 86 వేల కోట్ల రూపాయల ఖర్చు అయితే రూ లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని, కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వారు ప్రశ్నించారు. పిసి గోష్ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు మద్దతుగా కమిషన్ రిపోర్టులు తయారు చేయించు కోవాలని చూసి నటువంటి కాంగ్రెస్, ఇప్పుడు ఈ కేసు సిబిఐకి ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ కి కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దర్యాప్తు సంస్థకు అయిన ఈ కేసును అప్పగించవచ్చన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, ఈ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సంగ్లోత్ రంజిత్, కొత్తచెరువు హర్షవర్ధన్, పూజల ప్రసాద్, కొట్టే రాఘవేంద్ర, పోసారపు అరుణ్, కాలేరు అఖిల్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.