పేద రైతులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, ఉలవనూరు బంజర గ్రామానికి చెందిన రైతుల పత్తి పంటలను ఫారెస్ట్ అధికారులు పీకి ధ్వంసం చేశారని సిపిఐ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు ఆరోపించారు. మంగళవారం పత్తి పంటను పీకి వేసిన ప్రాంతాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. పాల్వంచ, యానంబైలు రేంజ్ పరిధిలో పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసి పేద (కోయ) రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం, బెదిరింపులు చేస్తూ పూత, కాత దశలో ఉన్న పత్తి పంటను పీకి వేసి వారి కర్కషత్వాన్ని చాటుకున్నారని ధ్వజమెత్తారు.ప్రభుత్వ పాలకులు.
రైతు దేశానికి వెన్నుముక అని, రైతులే దేశానికి అన్నం పెడుతున్నారని చెబుతూ ఉంటే. ఫారెస్టు అధికారులు మాత్రం ఆ ‘రైతు వెన్నుముక విరుస్తూ నోటికాడి బువ్వను కాలితో తన్నిన‘ రీతిలో చేతికి అందిన పంటను మానవత్వం లేకుండా పీకి వేసి రైతుల కష్టాన్ని, లక్షల రూపాయల పెట్టుబడిని బుగ్గిపాలు చేస్తున్నారని మండిపడ్డారు.అక్రమ సంపాదన కోసం అడవిని, గుట్టలను తవ్వి దందాలకు పాల్పడుతున్న బడా బాబులకు వత్తాసు పలుకుతూ కుటుంబాన్ని పోషించుకొనుట కోసం జీవనాధారం అయినటు వంటి వ్యవసాయాన్ని సాగుచేస్తూ తను తింటూ దేశానికి కూడా అన్నం పెడుతున్న పేద రైతులపై కక్షగట్టి పంటలు నాశనం చేస్తూ, రైతుల పొట్ట మీద కొట్టే దుర్మార్గ వైఖరికి ఫారెస్ట్ అధికారులు పూనుకోవడం చాలా దారుణమని అన్నారు.
ఒకవేళ ఆ భూమి ఆ పేద రైతులకు వర్తించని ఎడల. మే, జూన్, జూలై నెలలోనే రైతులు సాగు చేయకుండా, విత్తనాలు నాటకుండా ఆపి ఉండాల్సింది. కానీ ఎన్నో ప్రయాసలకోర్చి మూడు నెలల పాటు భార్యా, పిల్లలు కష్టపడి వేల రూపాయల పెట్టుబడి పెట్టి పెంచుకున్న పంటను పీకి వేసి రైతుల ఉసురు పోసుకోవడం ఫారెస్ట్ అధికారులకు సరికాదన్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారులు పేద రైతుల పంటలను ధ్వంసం చేసే వైఖరి మార్చుకోవాలని, లేనియెడల భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేద రైతులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం పాల్వంచ మండల కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, రైతు సంఘం మండల నాయకులు చిల్లా కృష్ణ, పూణెం రమేష్‌రైతులుగొగ్గేల బాబు,ఎర్రబోయిన చిట్టిబాబు, కాలం ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.






