18 June, 2026 | 1:56 AM

దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

18-06-2026 12:00 AM

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

షాద్‌నగర్ జూన్ 17 (విజయక్రాంతి): మతసామరాస్యానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర పుణ్యక్షేత్రం హాజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కాంగ్రెస్  పాలనలో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

బుధవారం దర్గాలో ఏర్పాటు చేసిన విందు(కందూరు)కు వచ్చిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆ ధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొత్తూరు వై జంక్షన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్గాకు చేరుకొని ఎమ్మెల్యే శంకర్, వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ అజ్మతుల్లా హుస్సేనీ లతో కలిసి దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గాలో బాబాలకు పూలు, చాదర్ లను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

సిద్ధాపూర్ గ్రామ శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని సిద్ధాపూర్, ఇన్ముల్ నర్వ గ్రామాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు మహేష్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గా ఆవరణలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. ఎవరికి ఇబ్బందులు కలుగకుండ పనులు చేపట్టనున్నట్లు భరోసా ఇచ్చారు.

అదేవిధంగా ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తున్నట్టు వైరల్ అవుతున్న వార్తలు కేవలం పూకార్లు మాత్రమే, దానిని నమ్మొద్దని అన్నారు. ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే పంపడం జరిగిందని, డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకుండా అడ్డుకొని మరో ప్రాంతానికి తరలించే విధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి గౌడ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ, ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, కొత్తూరు పట్టణ అధ్యక్షుడు జే సుదర్శన్ గౌడ్, గూడూరు సర్పంచ్ దయానంద్ గుప్తా,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.