14-02-2026 01:32:41 AM
నాలుగింట విజయం
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : రాష్ట్రంలో నిర్వహించిన ఏడు కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దూకు డు కనబరిచింది. నాలుగు కీలక కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఆధిపత్యం చాటుకోగా, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ పట్టు సాధించింది.
అదే దిశలో కరీంనగర్ కార్పొరేషన్ కూడా బీజేపీ ఖాతాలోకి వచ్చే అవ కాశం ఉంది. ఇక కొత్తగూడెంలో అనూహ్యంగా సీపీఐ.. బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో అధికారాన్ని కైవసం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇదిలా ఉండగా మున్సిపాలిటీలో గౌరవప్రదమైన స్థానాలను సొంతం చేసుకున్న బీఆర్‌ఎస్ మాత్రం కార్పొరేషన్లలో ఖాతా కూడా తెరువలేకపోయింది. ఆయా స్థానాల్లో కేవలం మద్దతు తెలిపేందుకే పరిమితమైంది.
మొత్తం ఏడు కార్పొరేషన్లలో నల్లగొండ, మంచిర్యాల, మహబూబ్‌నగర్, రామగుండం కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధించింది. పట్టణ ఓటర్లలో ప్రభుత్వ పథకాలు, స్థానిక నాయకత్వం ప్రభావం పనిచేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నల్లగొండ,
మహబూబ్‌నగర్‌లలో స్పష్టమైన మెజా ర్టీ రావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నిం పింది. రామగుండం, మంచిర్యాలలో గట్టి పోటీ మధ్య విజయం సాధించడం కాంగ్రెస్‌కు వ్యూహాత్మక బలం అందించింది. పట్టణ మౌలికవసతులు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక నాయకుల చురుకుదనం వంటి అం శాలు కాంగ్రెస్ విజయానికి కారణాలుగా పరిగణిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ తన బలాన్ని ప్రదర్శించింది. ఈ రెండు పట్టణాల్లో మధ్యతరగతి, యువ ఓటర్ల మద్దతు పెరగడం బీజేపీకి లాభించింది.
గతంలో బలమైన పోటీ మాత్ర మే ఇచ్చిన ప్రాంతా ల్లో ఈసారి అధికారం దక్కించుకోవడం బీజేపీకి రాజకీయంగా కీలక మైలురాయిగా భావిస్తున్నారు. కరీంగనర్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 31 కైవసం చేసుకుంది. బీజేపీకి ముగ్గురు బీజేపీ రెబల్స్ అభ్యర్థులతోపాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఉన్నట్టు సమాచారం. దీంతో కరీంనగర్ పీఠంపై కాషాయజెండా ఎగురవేసేందుకు లైన్‌క్లియర్ అయినట్టు స్పష్టమవుతుంది. ఈ ఫలి తాలు పట్టణ రాజకీయాల్లో బీజేపీ స్థిరమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనే సంకేతాన్ని ఇస్తున్నాయి.
కొత్తగూడెంలో రాజకీయ మలుపు..
కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీపీఐ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీఆర్‌ఎస్ మద్దతు కీలకమైంది. కొత్తగూడెంలో మొత్తం 60 స్థానాలకు గానూ కాంగ్రెస్, సీపీఐ చెరో 22 డివిజన్లను గెలుపొందాయి. బీఆర్‌ఎస్ 8, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 6 డివిజన్లను సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ మద్దతుతో సీపీఐ అధికారం చేపట్టే పరిస్థితి ఏర్పడింది. ఇది స్థానిక రాజకీయాల్లో సమీకరణాల ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టంచేసింది.
బీఆర్‌ఎస్ ప్రత్యక్ష అధికారంలో లేకపోయినా, కీలక మద్దతుదారుగా నిలవడం ద్వారా స్థానిక రాజకీయాల్లో తన ప్రభావాన్ని కొనసాగించాలనే వ్యూహం అవలంబించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో త్రిముఖ రాజకీయ పోటీ మరింత స్పష్టమవుతోందనే సంకేతంగా భావిస్తున్నారు. పట్టణ ఓటర్లు ఒకే పార్టీకి పూర్తి ఆధిపత్యం ఇవ్వకుండా, వివిధ ప్రాంతాల్లో భిన్న తీర్పు ఇవ్వడం గమనార్హం.
ఖాతా తెరవని బీఆర్‌ఎస్..
తెలంగాణలో జరిగిన ఏడు కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కొత్త దిశగా మలిచాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు ఈ ఫలితాలు అనుకూలంగా రాలేదు. గతంలో పట్టణాల్లో గట్టి పట్టు కలిగిన బీఆర్‌ఎస్ ఈసారి ఏ కార్పొరేషన్లోనూ ప్రత్యక్షంగా అధికారం సాధించలేకపోవడం గమనార్హం. నల్గొండ, మంచిర్యాల, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా, కరీంనగర్, నిజామాబాద్‌లపై బీజేపీ పట్టుకనబర్చింది.
ఇక కొత్తగూడెంలో సీపీఐ, బీఆర్‌ఎస్ మద్దతుతో అధికారాన్ని చేపట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ కూడా బీఆర్‌ఎస్ స్వయంగా గెలిచి అధికారంలోకి రాలేకపోవడం పార్టీ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. గతంలో అనేక మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపులు సాధించిన బీఆర్‌ఎస్ ఈసారి పట్టణ ఓటర్లను ఆకట్టుకోలేకపోయిందనే విశ్లేషణ వినిపిస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐకి మద్దతు ఇవ్వడం ద్వారా బీఆర్‌ఎస్ పరోక్షంగా ప్రభావం చూపినా, ప్రత్యక్షంగా అధికారంలోకి రాకపోవడం గులాబీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.