సీతన్న సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం
టిపిసిసి జనరల్ సెక్రటరీగా నాగా సీతారాములు..
కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ఓరవడిని సృష్టించుకుని కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతూ, నేడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు(Congress leaders Naga Seetharamulu) టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన జాబితాలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా నాగా సీతారాములును నియమిస్తూ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ సీతారాములు రాష్ట్ర స్థాయిలో, బీసి నేతగా మంచి పేరు సంపాదించారు.
కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ లో శూన్యత ఏర్పడినప్పుడు కార్యకర్తలకు అండగా నిలిచి అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. అధిష్టానం పిలుపు నిచ్చిన అనేక కార్యక్రమాలను విజయవంతం చేశారు. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యే రేసులో, ఒకసారి పార్లమెంట్ సభ్యుడి రేసులో ఉండి టికెట్ దక్కనప్పటికి, రాష్ట్ర నాయకుల మాటలకు విలువనిచ్చి పార్టీ నిర్దేశించిన అభ్యర్థులకు ప్రచారం చేసి నిబద్ధత చాటుకున్నారు. తాజాగా టిపిసిసిలో ఆయనకు మళ్లీ స్థానం లభించడం పట్ల కాంగ్రెస్ పార్టీలో హర్షం వ్యక్తం చేస్తోంది. తనకు జనరల్ సెక్రటరీ పదవి రావడం గురించి స్పందించిన నాగా సీతారాములు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు లకు ధన్యవాదములు తెలిపారు.






